గీతం ‘కోగన్ ఫ్యూజన్ ఫెస్ట్’లో స్పష్టీకరించిన అతిథులు
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఎంపిక చేసుకున్న ఒక సాంకేతికత, అంశం లేదా రంగంలో భావి ఇంజనీర్లు నైపుణ్యం సాధిస్తే, ఉపాధే వారిని వెతుక్కుంటూ వస్తుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ ఆధ్వర్యంలో ‘కోగన్ ఫ్యూజన్ ఫెస్ట్’ని బుధవారం ఘనంగా, ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సాంకేతిక చర్చ, ప్రాజెక్టుల ప్రదర్శనను కూడా ఏర్పాటుచేసి, విద్యార్థులు తమ సాంకేతిక నైపుణ్యాలను ప్రదర్శించడానికి, వినూత్న ఆలోచనలను పంచుకోవడానికి ఒక వేదికను అందించారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, పరిశ్రమ పోకడపై అభ్యాసం, ఆవిష్కరణలు, నైపుణ్యాలను పెంపొందించడం లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేశారు.జొమాటో పూర్వ సాంకేతికాభివృద్ధి ఇంజనీరు జి.బి.హర్షవర్ధన్, లేస్ అకాడమీ ముఖ్య కార్యనిర్వహణాధికారి నరసింహ మిక్కిలినేని, స్కేలార్ ఆర్గానిక్ గ్రోత్ స్పెషలిస్ట్ స్వరూప్ వీఐటీబీ, కేఎల్ఏ సాఫ్ట్-వేర్ ఇంజనీర్ వసంత కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొని, విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అత్యాధునిక సాంకేతికతలు, కెరీర్ వృద్ధి, వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్ ల్యాండ్-స్కేప్-పై వారి నైపుణ్యాన్ని పంచుకున్నారు. సాఫ్ట్-వేర్ రంగంలో ట్రెండింగ్ టెక్నాలజీలు, ఇంటర్న-షిప్, జాబ్ మార్కెట్-లపై అవగాహన కల్పించడమే గాక, విద్యార్థులకు మార్గనిర్దేశనం చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులు వినూత్న సాఫ్ట్-వేర్ ఆధారిత ప్రాజెక్టులను ప్రదర్శించి, వారి సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాలను చాటి చెప్పారు. ప్రాజెక్ట్ ఎక్స్-పో విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు. మొత్తంగా, ఈ వేడుకలో పాల్గొన్న వారు వృత్తిపరమైన పరిచయాలను పెంచుకోవడానికి, తాజా సాంకేతిక పోకడలపై లోతైన అవగాహనను ఏర్పరచుకున్నారు.