• ద్వితీయ వార్షికోత్సవంలో జీ-ఎలక్ట్రా క్లబ్ సభ్యులకు కోర్ ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ శాస్త్రి సూచన
• ప్రాజెక్టు ఎక్స్ పో విజేతలకు బహుమతులు ప్రశంసా పత్రాల ప్రదానం – వెబ్ సైట్ ప్రారంభం
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతంలోని విద్యార్థి క్లబ్ లలో ఎంతో ప్రభావశీలంగా నడుస్తున్న జీ-ఎలక్ట్రా క్లబ్ మరిన్ని ఆవిష్కరణలు చేసి మరింత ఉజ్వలంగా ప్రభవించాలని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్, డీన్-కోర్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ రామశాస్త్రి అభిలషించారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ విభాగంలోని జీ-ఎలక్ట్రా క్లబ్ ద్వితీయ వార్షికోత్సవాన్ని మంగళవారం అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారు. సాంకేతిక ఆవిష్కరణల పట్ల మక్కువను పెంచడం, గాడ్జెట్ల ఆటోమేషన్ లో పురోగతిని అన్వేషించడంతో పాటు, నూతన సాంకేతికతలను స్వీకరించడం లక్ష్యంగా ఈ క్లబ్ ను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా జీ-ఎలక్ట్రా కొత్త వెబ్ సైట్ ను స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ టి.మాధవిలతో కలిసి ప్రొఫెసర్ శాస్త్రి ఆవిష్కరించారు. ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన 22 సాంకేతిక ప్రదర్శనలలో అత్యుత్తమమైన వాటిని అవార్డులను అందజేశారు. ప్రాజెక్టు ఎక్స్ పో విజేతలకు ప్రశంసా పత్రాలను, మెమొంటోలను ప్రదానం చేశారు. గీతం, హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు జీ-ఎలక్ట్రా విద్యార్థులను అభినందించారు. టెరిటోరియల్ ఆర్మీ నుంచి జాతీయ బహుమతి గ్రహీత ప్రణవ్ ను వారంతా ప్రత్యేకంగా ప్రశంసించారు. గీతంలోని అత్యంత చురుకైన క్లబ్ లలో ఒకటిగా జీ-ఎలక్ట్రాను డాక్టర్ మాధవి అభివర్ణించారు. ఈ క్లబ్ సభ్యులు ఏ పోటీకి వెళ్లినా అవార్డులతో తిరిగొస్తారని డీవీవీఎస్ఆర్ వర్మ ప్రశంసించారు. తొలుత, జీ-ఎలక్త్రా అధ్యక్షుడు పల్లె దీపక్ వార్షిక నివేదికను సమర్పించగా, అధ్యాపక సమన్వయకర్తలు ఎం. నరేష్ కుమార్, డాక్టర్ డి.అనితలు సమన్వయం చేశారు.