ఘనంగా ప్రారంభమైన ఎస్జీఎఫ్ జిల్లా స్థాయి క్రీడోత్సవాలు
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
క్రీడల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని టాన్ చెరువు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన 68వ స్కూల్స్ గేమ్ ఫెడరేషన్ సంగారెడ్డి జిల్లా స్థాయి క్రీడోత్సవాలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుండే క్రీడలపై ఆసక్తి పెంపొందించడంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించాలని కోరారు. క్రీడల ద్వారా శారీరకదారుఢ్యం, మానసిక ఉల్లాసంతో పాటు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంలో ఉపయోగపడతాయని తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గంలో ఏడాది పొడవునా వివిధ అంశాల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తూ విద్యార్థుల్లో, యువకుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్, మండల విద్యాధికారి పిపి రాథోడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, మైత్రి క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.