రాష్ట్ర అతిథులకు జ్ఞాపికలుగా మన హస్త కళాకారుల కళాకృతులు

Andhra Pradesh politics

• లేపాక్షి సంస్థకు చెందిన కళాకృతులు, కలంకారీ వస్త్రాలు పరిశీలించిన పవన్ కళ్యాణ్ 

• ఉప ముఖ్యమంత్రికి కేటాయించిన బడ్జెట్లో 40 శాతమే వినియోగించి

• 60 శాతం తన సొంత సొమ్ము వినియోగించాలని శ్రీ పవన్ కళ్యాణ్  నిర్ణయం

అమరావతి ,మనవార్తలు ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వంతో సమావేశాలకు, వేడుకలకు రాష్ట్ర అతిథుల హోదాలో వచ్చే ప్రముఖులు, ప్రతినిధులను గౌరవించి, సత్కరిస్తారు. అదే విధంగా మన రాష్ట్రం తరఫున ఇతర రాష్ట్రాలకుగానీ, దేశ రాజధానికిగానీ వెళ్ళినప్పుడు మర్యాదపూర్వకంగా జ్ఞాపికలు ప్రదానం చేస్తారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు  పవన్ కళ్యాణ్  మన రాష్ట్ర హస్త కళాకారులు రూపొందించిన కళాకృతులు, కలంకారీ వస్త్రాలు ఇచ్చి సత్కరించాలని నిర్ణయించారు. తద్వారా మన రాష్ట్ర కళా సంపదకు ప్రాచుర్యం అందించడంతోపాటు హస్త కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుందనేది ఉప ముఖ్యమంత్రివర్యుల సదాలోచన. ఇందుకు అనుగుణంగా లేపాక్షి సంస్థలో ఉన్న కళాకృతులను శ్రీ పవన్ కళ్యాణ్  పరిశీలించారు. శ్రీకాళహస్తి పెన్ కలంకారీ వస్త్రాలు, నరసాపురం లేసు, కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, కొండపల్లి బొమ్మలతో చేసి దశావతారాలు, ధర్మవరం తోలుబొమ్మలు, బొబ్బిలి వీణ జ్ఞాపికలు, చిత్తూరు కొయ్య కళాకృతులూ, సవర గిరిజనులు వేసిన చిత్రాలు, రత్నం పెన్స్, దుర్గి రాతి బొమ్మలు, అరకు కాఫీ, మంగళగిరి శాలువాలు ఇలా పలు కళాకృతులు పరిశీలించారు. ఎంపిక చేసినవాటితో గిఫ్ట్ హ్యాంపర్ సిద్ధం చేయించి వాటిపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ముద్ర, అందులో కళాకృతుల వివరాలతో కూడిన కార్డు ఉంచాలని నిర్ణయించారు.

• కుమార్తె ముచ్చట తీర్చిన ఉప ముఖ్యమంత్రివర్యులు

లేపాక్షి సంస్థ ప్రదర్శించిన కళాకృతులను ఉప ముఖ్యమంత్రివర్యులు కుమార్తె ఆద్య తిలకించారు. ఆద్య అందులో కలంకారీ వస్త్రంతో చేసిన బ్యాగ్, కొయ్య బొమ్మలు చూసి ముచ్చటపడ్డారు. శ్రీ పవన్ కళ్యాణ్  వాటిని కొనుగోలు చేశారు. అందుకు సంబంధించి బిల్లు చెల్లించి బ్యాగ్, బొమ్మలు కొని కుమార్తెకు అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *