మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
హిందూ సంప్రదాయంలో ప్రతి పండుగ వెనుక ఒక పరమార్థం దాగి ఉందని, వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ పర్యావరణసహిత మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు.వినాయక చవితిని పురస్కరించుకొని జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణంలోని గాంధీ పార్క్ వద్ద ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రజలకు ప్రతిమలను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల అంశంపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. రసాయనలతో కూడిన ప్రతిమలను చెరువులలో నిమజ్జనం చేయడం మూలంగా జంతుజాలం చనిపోవడంతో పాటు, నీటి కాలుష్యం ఏర్పడుతుందన్నారు. జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ప్రజలందరికీ ఉచితంగా మట్టి వినాయకులు పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మూడు డివిజన్ల పరిధిలో 7500 వినాయక ప్రతిమలను ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్, అఫ్జల్, వెంకటేష్, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.