– రోడ్డును ఆక్రమించి వ్యాపారం చేస్తున్న అక్రమార్కులు
– ఆక్రమణలు తొలిగించాలని కాలనీ వాసుల డిమాండ్
మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
వివిధ కాలనీలకు సాఫిగా రాకపోకలు సాగించేందుకు వీలుగా అప్పట్లోనే వంద ఫీట్ల వెడల్పు రోడ్డును ఏర్పాటు చేశారు. కాలనీల్లో ప్రజల జనాభా పెరిగింది. కాలనీలు, బస్తీలు పెరిగాయి. ఇదే అధనుగా భావించిన అక్రమార్కులు వంద ఫీట్ల విస్తీర్ణం కలిగిన రోడ్డును యాదేచ్చగా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టి వ్యాపారం చేస్తూ ట్రాఫిక్ జాం కు కారకులవుతున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో గల మియాపూర్ లోని జాతీయ రహదారి నుండి మాధవ నగర్ లే అవుట్ లో నంది నగర్, అంబేద్కర్ నగర్, జనప్రియ నగర్, అపార్ట్మెంట్స్, పాత పోలీస్ స్టేషన్ రోడ్డు నుండి హాఫిజ్ పేట్ మీదుగా మాదాపూర్ కు వెళ్లే షార్ట్ కట్ గుండా వెళ్లేందుకు వంద ఫీట్ల వెడల్పు రోడ్డును ఏర్పాటు చేశారు. మొదట్లో రోడ్డు వెడల్పు గానే ఉండేది. కానీ కాలక్రమేణా ఆక్రమణ దారులు రోడ్డు ను ఆక్రమించి చిన్న చిన్న రూములు, షేటర్లు నిర్మించారు. వీధి వ్యాపారస్థులు, చిన్న, చిన్న డబ్బాలు, తోపుడు బండ్లు ఏర్పాటు చేసుకొని వ్యాపారం చేస్తున్నారు. ఈ దారి మొత్తం కుంచించుకుపోయి ఇరుకుగా మారింది. ధీంతో ట్రాఫిక్ రద్దీ ఏర్పడి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని వాహనదారులు వాపోతున్నారు. ట్రాఫిక్ రద్దీ వల్ల ప్రమాదాలు సైతం జరుగుతున్నాయని, గొడవలు జరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు.
డబుల్ బెడ్ రూమ్ లకు ఇదే రహదార హాఫిజ్ పేట్ చెరువు పక్కన ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ లకు సైతం ఇదే దారిని చూపెడుతున్నారు. ఇంత ఇరుకైన రోడ్డు ఆక్రమణలు తొలిగించకుండా అందరికి ఇది వంద ఫీట్ల వెడల్పు రోడ్డని చూపెట్టడం అధికారులకు తగదని చుట్టు పక్కల కాలనీ వారు పేర్కొంటున్నారు. వెంటనే ఆక్రమణలు తొలిగించి రోడ్డు ను వెడల్పు చేయాలనీ, అప్పుడే ట్రాఫిక్ రద్దీ తగ్గడం తో పాటు, ప్రమాదాలు జరుగకుండా ఉంటుందని అంటున్నారు. నిత్యం రద్దీ పెరుగడంతో పాటు, సాయంత్రం సమయంలోను, పండుగలప్పుడు పరిస్థితి మరింత జఠిలంగా మారుతుందని వివిధ కాలనీల ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు ఆక్రమణలు తొలిగించి, రోడ్డును విస్తరించాలని కోరుతున్నారు.
సర్వీస్ రోడ్ల అభివృద్ధి ఏమాయే ?
ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి గత ప్రభుత్వం సర్వీస్ రోడ్లను అభివృద్ధి చేయడం కోసం కొన్ని ప్రతిపాదనలు, ప్రణాళికలు రూపొందించారు. కొన్ని చోట్ల పనులు జరిగాయి, మరికొన్ని చోట్ల జరగాల్సిన ఉంది. మియాపూర్ జాతీయ రహదారి నుండి హాఫిజ్ పేట్ డివిజన్ పరిధిలోని పైన పేర్కొన్న కాలనీలకు, డబుల్ బెడ్ రూములకు వెళ్లేందుకు, షార్ట్ కట్ లో హాఫిజ్ పేట్ ఫ్లైఓవర్ వైపు వెళ్లాలన్నా వెంటనే ఈ రోడ్డును వంద ఫీట్లకు విస్తరణకు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.