ప్రభుత్వం లేదని చింతించొద్దు.. ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తాం..
40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి దౌర్జన్యాలను చూడలేము.
అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ప్రతిపక్షాలపై దౌర్జన్యకాండ..
పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు స్థానం నుండి గులాబీ జెండా రెపరెపలాడబోతోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి దీమా వ్యక్తం చేశారు.ఆదివారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన.. బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సన్నాహక సమావేశానికి మాజీ మంత్రి బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తన్నీరు హరీష్ రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సత్యనారాయణ, మదన్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.అనంతరం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదం, పటాన్చెరు నియోజకవర్గ ప్రజల నమ్మకం, పార్టీ కార్యకర్తల కృషితో హ్యాట్రిక్ విజయాన్ని సాధించడం జరిగిందని తెలిపారు. చేసిన పనిని చెప్పుకోవడంలో కొద్దిగా విఫలం అయ్యామని, మోసపూరిత హామీలు గుప్పించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు.
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారడం సహజమని, అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టులాంటిదని అన్నారు. ప్రజలు అందించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలే తప్ప, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తే ప్రజలు ఇంటికి పంపించడం ఖాయమని తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులని, ఎటువంటి కష్టం వచ్చినా 24 గంటలు అందుబాటులో ఉంటూ వారికి అండగా ఉంటామని తెలిపారు.రాబోయే పార్లమెంట్ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల ముందు సెమీఫైనల్స్ లాంటివని తెలిపారు. సమిష్టిగా పని చేస్తే సాధించలేనిది ఏమీ లేదని అన్నారు. మెదక్ పార్లమెంటు స్థానం నుండి పటాన్చెరు నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకులు గాలి అనిల్ కుమార్, భూపాల్ రెడ్డి ల పేర్లను పరిశీలించాలని ఆయన అధిష్టానానికి విన్నవించారు. ఎవరికి టికెట్ కేటాయించిన భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో అటవీ సంస్థ మాజీ చైర్మన్ ప్రతాపరెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.