పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) అనేది ప్రతిష్టాత్మక సంస్థలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు చదవడానికి మార్గం మాత్రమే కాదు, ఇది ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్ యూ), పరిశోధనా కేంద్రాలు, ఇతర సాంకేతిక విభాగాలలో విస్తృత శ్రేణి ఉపాధి అవకాశాలకు బాటలు వేస్తుందని హైదరాబాద్ లోని ఏస్ (ఏసీఈ) ఇంజనీరింగ్ అకాడమీ అధ్యాపకుడు ఎం. ఎం. త్రినాథ్ అన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని, కెరీర్ గైడెన్స్ కేంద్రం ఆధ్వర్యంలో ‘ప్రభుత్వ రంగ సంస్థలలో ఉపాధి అవకాశాలు’ అనే అంశంపై శనివారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు. ఇంజనీరింగ్ పట్టభద్రుల భవిష్యత్తును రూపొందించడంలో గేట్ ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు.
గేట్ నుంచి మార్కులను సాధించడం ద్వారా భారతదేశంలోని ఐఐఎసీసీ, ఐఐటీలు, ట్రిబుల్ ఐటీలు, ఎన్ఐఐటీల వంటి ప్రముఖ సాంకేతిక విద్యా సంస్థలలో మాస్టర్స్ (సీజీ)ని అభ్యసించడమే గాక, ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగం పొందడానికి ఉపకరిస్తుందన్నారు. మనదేశంలోని ప్రధాన పీఎస్ యూలలో తాజా ఇంజనీరింగ్ పట్టభద్రులకు ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉన్నాయని, ఇక్కడ ప్రాథమిక అర్హత కోసం గేట్ తప్పనిసరి పరీక్షగా పనిచేస్తుందని చెప్పారు. దీనికి అదనంగా, భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో), బాబా అణు పరిశోధనా కేంద్రం (బార్క్) వంటి నాన్-పీఎస్ యూ కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా గేట్ స్కోర్ ల : ఆధారంగా అభ్యర్థులను నియమించుకుంటాయని త్రినాథ్ నివరించారు. అంతేకాక, గేట్ అర్హత కలిగిన విద్యార్థులకు సగటున రూ.12,400 నుంచి 28,000 వరకు ఉపకార వేతనాన్ని పలు ప్రభుత్వ రంగ సంస్థలు అందజేస్తాయన్నారు.
ఔత్సాహిక ఇంజనీర్లు తమ మాస్టర్స్ డిగ్రీని భారతదేశంలో లేదా విదేశాల్లోని అత్యుత్తమ విద్యా సంస్థలలో అభ్యసించాలని త్రినాథ్ సూచించారు. గేట్-అర్హత కలిగిన విద్యార్థులు కేవలం ఒక లక్ష (స్టయిఫండ్ తీసివేసిన తరువాత) ఖర్చు చేయడం ద్వారా మనదేశంలోని అత్యున్నత విద్యా సంస్థలలో మాస్టర్స్ డిగ్రీని అభ్యసించవచ్చని, విదేశాలలో వచ్చే వేతనానికి సమానమైన మొత్తాన్ని మనదేశంలోనే పొందవచ్చని చెప్పారు. అటువంటప్పుడు విదేశీ మాస్టర్స్ కోసం 40 నుంచి 50 లక్షలు ఖర్చుచేసి అదే వేతనాన్ని పొందడం వల్ల ఒనగూనే అదనపు ప్రయోజనం ఏమిటో ప్రతిఒక్కరూ ఆలోచించాలన్నారు. ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ అందించే సేవలు, శిక్షణ, స్వల్ప వ్యవధి సర్టిఫికేట్ కోర్పులను త్రినాథ్ వివరించడమే గాక, విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు.