_క్రీడల అభివృద్ధికి సంపూర్ణ సహకారం
_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
_విజేతగా నిలిచిన ఎస్సార్ గ్రూపు జట్టు
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
బాల్యం నుండే క్రీడల పై ఆసక్తి పెంపొందించుకోవడం మూలంగా మానసిక ధైర్యం, శారీరక దృఢత్వం లభిస్తుందని, నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో మైత్రి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో గత తొమ్మిది రోజులగా నిర్వహిస్తున్న 34వ మైత్రి ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకలు శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు నగదు బహుమతి ట్రోఫీలను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దశాబ్దాల చరిత్ర గలిగిన మైత్రి క్రీడా మైదానం రాష్ట్ర, జాతీయ క్రీడలకు వేదికగా నిలిచిందని తెలిపారు. ఎంతో మంది క్రీడాకారులు ఇదే మైదానంలో శిక్షణ పొంది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించారని గుర్తు చేశారు. పటాన్చెరులో క్రికెట్ అభివృద్ధికి మైత్రి క్రికెట్ క్లబ్ అందిస్తున్న సేవలను ఆయన ప్రశంసించారు. క్రీడలపై ఆసక్తి ప్రతిభ కలిగిన పేద క్రీడాకారులకు ఆర్థిక సాయం అందించడంతోపాటు వారి అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గం వ్యాప్తంగా మినీ స్టేడియాలు నిర్మిస్తూ ప్రతి ఒక్కరిలో క్రీడలపై ఆసక్తిని పెంపొందిస్తున్నామని తెలిపారు. అనంతరం ఎస్ ఆర్ గ్రూప్ వర్సెస్ టి ఎస్ బి ఏ అకాడమీ జట్ల మధ్య జరిగిన ఫైనల్ హోరాహోరీ మ్యాచ్ లో ఎస్సార్ గ్రూప్ 120 పరుగులతో ఘన విజయం సాధించింది .ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ కార్పొరేటర్లు శంకర్ యాదవ్ సపనాదెవ్, బిజెపి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, ఎస్సార్ గ్రూప్ అధ్యక్షులు అంజిరెడ్డి, మాజీ ఎంపీపీ మగ్దుం, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, సిపిఐ జిల్లా కార్యదర్శి ప్రకాష్, మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షులు హనుమంత రెడ్డి, ప్రధాన కార్యదర్శి గిరి, క్రీడాకారులు పాల్గొన్నారు.