శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 2024 శేరిలింగంపల్లి మండల శాఖ క్యాలెండర్ ఆవిష్కరణ మండల విద్య వనరుల కేంద్రంలో, శేరిలింగంపల్లి మరియు వివిధ మండల పరిధిలోని పాఠశాలలో జరిగిందని ఉపాధ్యాయుల సంఘం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ఈ. గాలయ్య, మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా అధికారం చేపట్టిన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలుపుతూ గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న విద్యారంగ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగ , ఉపాధ్యాయులందరికి వర్తింపజేస్తున్న సీపీఎస్ ను వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు..317 జీవో బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న మూడు డి ఏ లతోపాటు గత సంవత్సర కాలంగా ట్రెజరీల్లో ఆమోదం పొంది ఆర్థిక శాఖ వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లును సత్వరమే చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధానకార్యదర్శి వెంకటప్ప మాట్లాడుతూ ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు విద్యాసంవత్సరం ముగిసిన అనంతరం మే నెలలో చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర కమిటీ సభ్యులు గొడుగు శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి నాగేంద్ర మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి మండల అధ్యక్షులు కే . నర్సింలు, ప్రధాన కార్యదర్శి ఎం.నర్సింలు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.