పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్-లో బుధవారం మహాత్మా గాంధీ 155వ జయంతిని నిరాడంబరంగా నిర్వహించి, ఆయన విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. గాంధీజీ బోధించిన అహింస, సత్యం, సరళతల శాశ్వతమైన వారసత్వం, ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో ప్రతిధ్వనిస్తూనే ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మననం చేసుకున్నారు.మన దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో గాంధీజీ పోషించిన కీలక పాత్రను గౌరవించే సంస్మరణ వేడుకలుగా దీనిని నిర్వహించారు. ఆయన అహింస తత్వశాస్త్రం భారతదేశ స్వాతంత్ర్య పోరాటాన్ని మార్చడమే కాకుండా సామాజిక న్యాయం, శాంతి కోసం ప్రపంచ ఉద్యమాలను ఎలా ప్రేరేపించిందో గీతం వర్సిటీ ఉన్నతాధికారులు నొక్కి చెప్పారు. ఐక్యరాజ్య సమితి అక్టోబరు 2వ తేదీని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా గుర్తించిందని, ఇది గాంధీ ప్రపంచవ్యాప్త ప్రభావాన్ని మరింత సుస్థిరం చేస్తోందని వారు పేర్కొన్నారు.గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ఇన్ ఛార్జి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.రెజా, పూర్వ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీ.ఏ.రామారావు, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డైరెక్టర్ ప్రొఫెసర్ బందన్ కుమార్ మిశ్రా, గీతం ఎస్టేట్ అధికారి డీఏవీ మోహన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేటి ప్రపంచంలో గాంధీజీ బోధనల ఔచిత్యాన్ని ఈ సందర్భంగా వారు నొక్కి చెప్పారు.

