సాయిబాబా సెల్యులోజ్ పరిశ్రమలో చేయి కోల్పోయిన కార్మికుని కుటుంబాన్ని ఆదుకోవాలి

politics Telangana

సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్ చెరు పారిశ్రామిక వాడలో గల సాయిబాబా సెల్యులోజ్ పరిశ్రమలో ప్రెస్సింగ్ మిషన్లో పనిచేస్తూ కుడి చేతిని కోల్పోయిన అమర్ సింగ్ కుటుంబానికి యాజమాన్యం నష్టపరిహారం చెల్లించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు పరిశ్రమ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. శనివారం పరిశ్రమ తో పాటు పటాన్ చెరు పట్టణంలోని అమర్ సింగ్ చికిత్స తీసుకుంటున్న ధ్రువ హాస్పిటల్ ను సందర్శించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ సెల్యులోజ్ పరిశ్రమలో అమర్ సింగ్ గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడని అన్నారు. విధి నిర్వహణలో భాగంగా శుక్రవారం జనరల్ షిఫ్ట్ కు వెళ్ళగా మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ప్రెస్సింగ్ మిషను లో ఆపరేట్ చేసే క్రమంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా సేఫ్టీ పరికరాలు ఇవ్వకపోవడంతో అమర్ సింగ్ చేసే క్రమంలో తన కుడిచేయిని కోల్పోవలసి వచ్చిందని వాపోయారు. ప్రమాదం జరిగి రోజు గడిచిపోయినప్పటికీ జరిగిన సంఘటనను యాజమాన్యం పూర్తిగా దాచిపెట్టే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. వైద్య ఖర్చు లు ఇవ్వకుండా చేతులు దులుపుకునే ప్రయత్నం యజమాన్యం చేస్తుందని, అమర్ సింగ్ వైద్య ఖర్చులన్నీ పరిశ్రమ యాజమాన్యం పూర్తిగా భరించడంతోపాటు తన కుడి చేతిని కోల్పోవడంతో అమర్ సింగ్ కుటుంబం పూర్తిగా రోడ్డు మీద వచ్చిందని, కార్మిక శాఖ, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శాఖల అధికారులు వెంటనే స్పందించి కుటుంబాన్ని పూర్తిస్థాయిలో ఆదుకోవడం తోపాటు యాజమాన్యంను కఠినంగా శిక్షించేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అమర్ సింగ్ కుటుంబం రోడ్డున పడకుండా పరిశ్రమ యాజమాన్యం 30 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, పరిశ్రమలో పనిచేస్తున్న ఏ ఒక్క కార్మికునికి కూడా ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు అందడం లేదని, జిల్లా అధికార యంత్రాంగం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని లేనిపక్షంలో బాధితుడు కుటుంబం తరపున పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని ఈ సందర్భంగా హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *