పటాన్ చెరు:
పల్లె, పట్టణ ప్రగతి ద్వారా పల్లెలు, పట్టణాలు బాగుపడాలన్నదే ప్రభుత్వ ఆశయమని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమంలో భాగంగా బుధవారం కలెక్టర్ పటాన్ చెరు మండలం రుద్రారం పల్లె ప్రగతిలో పాల్గొని, ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. రుద్రారం గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రగతి కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ…
పట్టణాల కన్నా పల్లెలు బాగున్నాయని, గ్రామాల్లో సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలు పోటాపోటీగా పనిచేస్తున్నారన్నారు. పల్లెలు పట్టణాలు అభివృద్ధి చెందితే బంగారు తెలంగాణ వచ్చినట్టేన న్నారు. రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లా వైకుంఠ దామాలు, డంపింగ్ యార్డులు వంద శాతం నిర్మించి ప్రథమ స్థానంలో నిలిచామన్నారు. అందరి కృషితో ఇది సాధ్యమైందన్నారు. సేగ్రి గేషన్ షెడ్ ల నుండి 80 శాతం మేర ఎరువు కూడా తయారు చేస్తున్నామన్నారు. ప్రతి చిన్న పల్లె, తాండాకు ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్, డోజర్ వచాయన్నారు. ప్రభుత్వం అన్ని గ్రామ పంచాయితీలలో ఈ వసతులు కల్పించినట్లు కలెక్టర్ వివరించారు. మిషన్ భగీరథ తో ప్రతి ఇంటికి తాగునీరు వచ్చిందని, ప్రజలు నీటిని వృధా చేయకుండ వినియోగించుకోవాలని సూచించారు.
గ్రామంలోని ఎస్సీ కాలనీలో కొందరికీ నీరు రావడంలేదని తెలిపారని, అందరికీ నీరు రావాలని, మోటార్లు పెడితే సీజ్ చేయాలని పంచాయతీ సెక్రెటరీకి ఆదేశించారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని, ఇది ఒక అలవాటుగా కొనసాగాలన్నారు. ఏదేని పరిస్థితుల్లో ఒక మొక్కను తొలగిస్తే దానికి బదులుగా పది మొక్కలు నాటాలని సూచించారు. పెద్ద మొక్కలను యధావిధిగా తీసి మరోచోట పెట్టే టెక్నాలజీ వచ్చిందన్నారు. మనిషికి ప్రాణవాయువు అందించేది మొక్కలేనని, మొక్కలు నాటాలి, పెంచాలి, రక్షించాలన్న దృక్పథం అందరిలో కలగాలన్నారు. ప్రతి ఒక్కరు పరిసరాలను శుభ్రంగా ఉంచితే గ్రామం మొత్తం పరిశుభ్రంగా ఉంటుందన్నారు.
పచ్చదనం, పరిశుభ్ర గ్రామాలుగా మారినప్పుడే అందరూ ఆరోగ్యంగా ఆహ్లాదంగా జీవిస్తారని, అందుకు ప్రతి ఒక్కరు ప్రతినబూనాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజర్షి షా, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిఆర్డిఓ శ్రీనివాస రావు, డిపిఓ సురేష్ మోహన్, డిఎఫ్ఓ వెంకటేశ్వర్లు, డిఎల్పిఓ సతీష్ రెడ్డి, పటాన్ చెరు జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, ఎంపీపీ సుష్మశ్రీ వేణుగోపాల్ రెడ్డి, తహసీల్దార్ మహిపాల్ రెడ్డి, ఎంపీడీవో బన్సీలాల్, రుద్రారం సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఎంపీటీసీలు మనె రాజు, హరిప్రసాద్ రెడ్డి, ఎంపీఓ రాజు, కార్యదర్శి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.